పసుపు బోర్డు ఏర్పాటు కాంగ్రెస్​ కృషి వల్లే :  రూరల్ ఎమ్మెల్యే డాక్టర్​భూపతిరెడ్డి

 నిజామాబాద్​, వెలుగు : పసుపు బోర్డు ఏర్పాటు వెనక కాంగ్రెస్​సర్కారు కృషి ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. గతేడాది ఫిబ్రవరి, నవంబర్​లో రాష్ట్ర అగ్చికల్చర్​మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్​రావు పసుపు బోర్డు ఆవశ్యతను తెలుపుతూ రెండుసార్లు అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాశారని, రైతులతో కలిసి కాంగ్రెస్​ కేంద్రంపై ఒత్తిడి తేవడంతో బోర్డు ఏర్పాటు చేశారన్నారు. అయితే ఎలాంటి ప్రొటోకాల్ పాటించక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​ఢిల్లీ నుంచి వర్చువల్​గా, దీనిని ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

గురువారం నిజామామాద్​లోని డీసీసీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టేట్ గవర్నమెంట్​కు ఎలాంటి సమాచారం ఇవ్వక, పసుపు రైతులను ఆహ్వానించక కొంపలు మునిగినట్లు ఆగమేఘాలపై హోటల్​లో బోర్డునెందుకు ప్రారంభించారని ప్రశ్నించిన మంత్రి తుమ్మలను ఎంపీ అర్వింద్ విమర్శించడం తగదన్నారు. తండ్రి వయస్సు వ్యక్తిని గౌరవించే సంస్కారం మరిచారని ఫైరయ్యారు. 2019లో పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్​రైతులకు స్టాంప్ పేపర్ రాసిచ్చి స్పైస్​బోర్డు పేరుతో నగరంలోని 4వ డివిజన్ బ్యాంక్​ కాలనీలో ఆఫీస్​మాత్రమే ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు.

బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే దాని విధివిధానాలను కూడా వెంటనే ప్రకటించాలని డిమాండ్​ చేశారు. ఎంత మంది డైరెక్టర్లను నియమించేది? రీసెర్చ్​సెంటర్​పెడతారా? లేదా? రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటో పూర్తిగా స్పష్టం చేయాలన్నారు. అధికారం పోయిన ఫ్రస్టేషన్ కేటీఆర్, హరీశ్​రావును ఇంకా వీడడంలేదని, కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, ఐడీసీఎంఎస్​ చైర్మన్ తారాచంద్​నాయక్, కాంగ్రెస్ లీడర్లు శేఖర్​గౌడ్, శ్రీనివాస్, ప్రవీణ్, విపుల్​గౌడ్, నరేశ్, నవీన్​గౌడ్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.